ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Thursday, November 1, 2012

బోటులో టాగోర్‌

పద్మానదిపై
పడవలో కూచుని
ఒకటి రెండు మబ్బు బెలూన్ల కింద
ఒంటరిగా టాగోర్‌

బిగిసిన జలచర్మంతో
నిగనిగలాడే నదిబాజా.
కడచిపోయిన
పడవల్నీ
తేలిపోయిన
తెలిమబ్బుల్నీ
నెమరేసే పద్మకు
కడుపు నిండా
సుడిగుండాల్లా
కోట్లకొద్దీ
కథలు.
నదిబాజాని మోగించే
సదా బాలకుడు టాగోర్‌

ఏకాంత నౌకాయానంలో
ఏమేం కథలు విన్నావు, టాగోర్‌
మూగపిల్ల ‘సుభా’ గుండెల్లో
ముసురుకున్న కేకలు విన్నావా?
బాల్యయౌవనాల మధ్య గతుకులో
‘ఫటిక్‌ ‘ మనస్సు పుటుక్కుమనటం విన్నావా?
ప్రళయంలోంచి తప్పించుకు ప్రేమ
వలయంలో పడ్డ ‘నీలకాంత్‌ ‘ వ్యథ విన్నావా?
పదిలంగా దాచుకున్న
యెదలోబొమ్మ బద్దలవగా
గాయపడి ‘కాబూలీ’ పెట్టిన
గావుకేక విన్నావా?
ఇంకేమేం విన్నావు, టాగోర్‌ !

మా చిన్నప్పుడు
మమ్మల్నీ మబ్బుల
దరువులు వాయించే
డొరువుల మృదంగాలు
వింత ఊసులతో
చెంతకు పిలిచేవి.
చడ్డీల్ని ఊడ్చేసి
ఒడ్డున పడేసి
మాతృగర్భంలోకి
మరలిపోచూసే
పిల్లల్లాగో,
ప్రియురాలి అంతరంగాల్లోకి
లయమవాలనుకునే
ప్రేమికుల్లాగో
చిరంతనపు లోతుల్లోకి
చివాల్న దూకేవాళ్ళం.

ఆకాశమంత లోతైన
ఆ కాసారలెండిపోయి
బీటలుపడిన గుండెల్ని
బయటపెట్టాయి నేడు.
పద్మని పగలగొట్టి
పంచుకున్నప్పుడు టాగోర్‌
ఎన్ని వికృత శబ్దాలు
ఎన్ని హహాకారాలు
ఎంత భీభత్సం!
అంతటితో బాల్య
మంతమైంది.

సరిత్తీర నికుంజాల్లో
నిరీక్షించేవి
మెరిసే కళ్ళుకావు,
గురితప్పని
గుడ్డితుపాకులు.
వసంతాన్ని మోసుకొచ్చే
పసిడిపిట్టలు కావెగిరేవి,
మృత్యువును నోట కరచుకున్న
హత్యాకారి బుల్లెట్లు.
మోగటం లేదు
టాగోర్‌ ఇవాళ
హృదయంగమాలైన బాల్య
మృదంగాలు
జబ్బులతో, ఆకలితో
ఉబ్బిన
పిల్లల పొట్టలడోళ్ళు,
ఎల్లెడలా వాటి చప్పుళ్ళు.

జూన్‌ 1974

No comments:

Post a Comment